నలభై దాటాక ఒకటి రెండు సార్లు అనిపించింది చిన్నప్పటి గుర్తుల గురించి రాస్తే బాగుంటుంది అని. ఎలాగో హాఫ్ ఇన్నింగ్స్ ఐపోయింది కాబట్టి బాల్యంలోని తీపి చేదు ఇంకొంత ఆగాక గుర్తు ఉండకపోవచ్చు. బాల్యం లో తీపి బానే ఉన్నా చేదు కూడా మోతాదు కి మించే ఉంది వేర్వేరు కారణాల వల్ల.
ఊహ తెల్సిన తరువాత వేసవి సెలవులు అంటే నర్సాపూర్ ఎక్స్ప్రెస్ కి హైదరాబాద్ నుంచి విజయవాడ ట్రైన్ స్లీపర్ కోచ్ లో వెళ్ళాలి (అమ్మకి బస్ పడదు). అక్కడ్నుంచి స్టేషన్ దిగి బస్ స్టాండ్ కి వెళ్ళి మోపిదేవి వెళ్ళే బస్ ఎక్కాలి. ఎత్తి కొట్టే బస్ లో 2 గంటలు ప్రయాణం చేసి, బస్ దిగాక రిక్షా ఎక్కి పాలెం వెళ్ళాలి. ప్రతి సమ్మర్ హాలిడేస్ కి ఇదే షెడ్యూల్, ఏమి మార్పు లేకుండా. బస్ దిగే లోపు అమ్మ రెండు వాంతులు గ్యారంటీ. మేము వెళ్ళేది పెద్ద మావయ్య ఇంటికి. మా అమ్మమ్మ వాళ్ళు ఒకప్పుడు ఉన్న ఇల్లు అది, మా అమ్మ, పెద్దమ్మ, మేనమామలు పెరిగిన ఇల్లు. ఊరికి సెంటర్ లో ఇంటి బయట సాయంకాలం అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకోడానికి అరుగులు ఉండేవి గుమ్మం బయట.
ఒక పాక అది పిండివంటలు వండే కిచెన్, మధ్యలో స్థలం, మళ్ళీ పెంకుటిల్లు, దాంట్లో రోజు మేము కూర్చొని తినే ప్లేస్, గ్యాస్ పొయ్యి, అందులో ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా విని అడిగినవి చేసి పెట్టే మా అత్త (అమ్మ కి వదిన మరియు మేనమామ కూతురు). ఇంటికి రాగానే పెద్ద మావయ్య ఎత్తుకుని బీడీ వాసనతోనే ముద్దు పెట్టుకోడం బుగ్గ మీద. ఇది జరగాల్సిందే, వెళ్ళగానే, వచ్చే ముందు. నాకు గుర్తున్నంత వరకు నా లైఫ్ లో మగవాళ్ళు ఎవరు ముద్దు చేసింది తక్కువ, ఆయన తప్ప. పొద్దునే టిఫిన్ అంటే ఆయన పీట వేసుకుని వంటింట్లో కూర్చుంటే అత్త ఊతప్పం, దోశ ఏదో ఒక టిఫిన్ ఆయన తింటుంటే ఆయన పక్కన కూర్చుని ఏదో కబుర్లు చెప్పడం అంతే పని. ఆయన పొలం వెళ్లాక మాకు టిఫిన్ వేసేది అత్త. అమ్మ కి ఏమి పని చెప్పేవారు కాదు, ఈవిడ చేసేది కాదు :) (దీని బ్యాక్ స్టోరీ మళ్ళీ చెప్తాను).
అత్త ఎప్పుడూ వంటింట్లో ఉన్నట్టే గుర్తు, హాల్ లోకి వచ్చిన ఏదో ఒక పని చేసుకోవాల్సిందే. నాకు ఆవిడ ఆ టైమ్ లో ఎప్పుడన్నా నిద్ర పోయిన గుర్తు లేదు మధ్యానం. పెద్ద మావయ్య అంటే తెల్ల జుబ్బా లాంటి షర్ట్, ఒక పాకెట్ ఉండేది, ఎక్కువ గళ్ళ లుంగీలు కట్టేవాళ్ళు. మరీ ఏదన్నా ఫంక్షన్ అయితే తప్ప పంచ కట్టే అలవాటు లేదు. ఎప్పుడూ ఇంటికి ఎవరో ఒకరు వస్తూ ఉండేవారు కలవడానికి అన్నయ్యా అనుకుంటూ. ఊర్లో సగం మంది కజిన్స్, వాళ్ళ కజిన్స్, అందరికి పాలెం లో ఈయన, వార్పు లో ఇంకో మావయ్య హెడ్స్.
పెద్ద మావయ్య గొలుసుకట్టు తో అమ్మకి లెటర్స్ రాసేవారు. చిన్న కన్నమ్మ అని పిలిచేవారు. పెద్దమ్మని నిజామాబాద్ ఇచ్చారు. ఆ రోజుల్లో మోపిదేవి నుంచి నిజామాబాద్ అంటే ఇవాళ ఇండియా నుంచి US వెళ్లినంత ప్రయాణం. సో ఆవిడ రావాలంటే ఏదో పెళ్ళి ఓ పెద్ద ఒక్కేషన్ ఉంటే తప్ప వచ్చేది కాదు. వస్తే ఎక్కువ రోజులు ఉండి అందర్నీ కలిసేది మళ్ళీ ఎప్పుడూ వస్తానో గ్యారంటీ లేదు అని. మాకు ఆ రూల్స్ లేవు, వేసవి అంతా ఆంధ్రా లోనే గడిచేది.
పెద్ద మావయ్య గురించి గుర్తున్నవి, ఆయన 60s lone Bcom చదివి బెంగళూరు లో ఉద్యోగం వస్తె ఇష్టం లేదు అని వ్యవసాయం చేసిన మనిషి. నాకు ఊహ తెలిసే సరికి కోళ్ల ఫారం లో నష్టాలు, తుఫాను, ఇలా కష్టాలు చాలానే. అయినా మేము వస్తె మాకు అవేవీ తెలీకుండా ఇబ్బంది పడినా ఏమి చెప్పకుండా ఏది కావాలన్నా ఇచ్చేవారు. ఆయనకి కోపం వస్తె జనాలు పారిపోయేవాళ్ళు. అంత కోపం వచ్చింది అంటే అవతల వ్యక్తి మటాష్. ఒక సారి పొలం లో వరి ఉంది, మందు ఏదో తప్పు కొట్టాడు పని చేసే అతను. వాడు ఆయన నన్ను చంపేస్తారు, కన్నమ్మ గారు మీరే ఆపాలి అని అమ్మకి వచ్చి చెప్పాడు. అమ్మ ఏదో సర్ది చెప్పింది. అయినా అది తాటాకు కోపం. ఇలా వచ్చి అలా వెళ్ళేది.
వ్యవసాయం కాకుండా ఆదాయం ఉండాలని దున్నపోతు నీ మెయింటేన్ చేసేవారు. ఎక్కడెక్కడో ఊళ్ల నుంచి ఇక్కడికి వచ్చేవారు మావయ్య దగ్గరికి. ఒక రోజు బాగా వాన కురుస్తుంది అని దాన్ని ఇంటి లోపల షేడ్ ప్లేస్ లో కట్టేశారు. మా వదిన, ఆయన పెద్ద కూతురు నీ దున్నపోతు ఏం చేస్తోంది అంటే ఆవిడ రెస్పాన్స్ కూర్చుంది అని (పడుకుంది అనాలి), అది పెద్ద జోక్ మాకు, అందరికి చెప్పేవాళ్ళం, కూర్చోడం ఏంటి నీ మొహం అని ఆయన అన్నారు :). ఇప్పటికీ చెప్పుకుని నవ్వుకుంటాం. తమ్ములు బోధన్ నుంచి, వరంగల్ కమలాపురం నుంచి రెగ్యులర్ గా ఉత్తరాలు రాసేవారు ఆయనకి, అవి మేము కూడా చదివినట్టు గుర్తు.
ఆడ పిల్లలు హైద్రాబాద్ లో ఉద్యోగం చేస్తుంటే మగ పిల్లాడు గాలికి మోపిదేవి సెంటర్ లో తిరుగుతున్నాడు అని ఈయనకి కోపం. నాకు గుర్తుండి వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంది లేదు పెద్దగా. కమ్యూనికేషన్ అంతా లేడీస్ ద్వారానే (అమ్మమ్మ, అత్త, వదినలు, అమ్మ etc). అమ్మమ్మకి పెద్ద మనవడు అంటే పిచ్చి , మేము ఎవరం వచ్చిన అంత ప్రేమ ఉండేది కాదు. బావ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకు వెళ్లేవాడు. మోపిదేవి సెంటర్ లో గొడవ అయిందంటే బావ ఉండాల్సిందే అక్కడ :). ఇవాళ కొడుకు ఎంత మందికి ఉద్యోగాలు ఇప్పించాడు, హెల్ప్ చేస్తున్నాడు చూసుకోడానికి మావయ్య లేడు. కాకపోతే ఆయన కోపం, పౌరుషం, మొండిపట్టు అన్ని అలానే దిగినాయి కొడుక్కి.
పెద్ద మావయ్య కి నేను ఆరవ తరగతి చదువుతుండగా క్యాన్సర్ వచ్చింది. ఆ రోజుల్లో బానే కర్చుపెట్టి వైద్యం చేయించిన లాభం లేదు అడ్వాన్సు స్టేజ్ కాబట్టి. హైదరాబాద్ నుంచీ పాలెం తీసుకు వెళ్తుంటే హాలిడేస్ ఇవ్వగానే వస్తావలె అన్నాడు ట్రైన్ బయలుదేరు తుంటే అదే నేను ఆఖరు ఆయన్ని సరిగ్గా చూడడం. బావ ఉద్యోగం మానేస్తా అంటే కంపెనీ వాళ్ళు ఎంత టైమ్ అయినా పర్లేదు అని నెలలు తరబడి లీవ్ ఇచ్చారు. ఒక రెండు మూడు నెలలు ఉన్నాడు మంచంలోనే. అందరూ దగ్గరుండి బాగా చూసుకుని పంపారు ఆయన్ని. అమ్మ, నాన్న, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, భార్య, ఆయన పిల్లలు. ఆయన ఉన్నంత లో కష్టపడ్డా మాట పడకుండా బోలెడంత ఫ్రెండ్స్ ని సంపాదించుకున్నాడు. మా అందరి ప్రేమ ఎప్పటికీ అలానే ఉంటుంది ఆయన మీద.
సక్సెస్ కి రకరకాలు గా నిర్వచనం ఉంది ఇవాళ రేపు. ఆ కొలమానం లో అంత సక్సెస్ కాదేమో ఆయన. నా దృష్టిలో అమ్మ నాన్న, పెళ్ళాం, పిల్లలు, తమ్ముళ్ళు (2 తమ్ములు కాలక్రమేణా ఆయన్ను జాయిన్ అయ్యారు), చెల్లెళ్ళు, స్నేహితులు ఇలా అందరూ ఇవాళ కూడా ఆయన్ను 30 ఏళ్ల తరువాత కూడా గుర్తు చేసుకుని బాధ పడుతూ ఉంటారు. ఇవాళ ఆయన మాతో లేకపోయినా ఆ వెలితి అలానే ఉంది. ఇప్పటికీ పాలెం వెళ్తే మేము బయటికి చెప్పక పోయిన ఆ ఇంటి వైపు చూడడానికి మనస్సు రాదు. అమ్మ వెళ్తూనే ఉంటుంది, నేను మాత్రం ఆ గుమ్మం తొక్కి 25 ఏళ్ళు అయింది.
పెద్ద మావయ్య ది ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఉంది, స్టైల్ గా సినిమా హీరో లా ఉన్నది. అది ఎక్కడ ఉందో తెలీదు. పెయింటింగ్ లాంటి ఫోటో మాత్రం ఉంది ఇంట్లో. 30 సంవత్సరాల తరువాత చాలా విషయాలు గుర్తు లేవు. ఫేస్ ఎలా ఉండేదో కూడా లీల గా గుర్తుంది అంతే. ఏం గుర్తుంది అంటే, ఏదున్నా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాలి, తప్పు చేయనప్పుడు భయపడకూడదు, మనకి నచ్చినట్టు నచ్చిన చోటు ఉండి అమ్మ నాన్న లని చూసుకోవాలి. ఇవే ఆయన మాకు నేర్పినవి. ఆయన ఎక్కడున్నా ఎప్పుడూ మా మీద ఒక కన్ను వేసే ఉంచుతారు అని నమ్మకం. నా అదృష్టమో దురదృష్టమో ;), ఆంధ్రా పిల్ల, కృష్ణ జిల్లా అమ్మాయిని చేసుకున్నా. సో ఏడాదికి కనీసం 4-5 సార్లు వెళ్తాను. ఎవరింటికి వెళ్ళినా ఎక్కడొక్కడ మీ పెద్ద మేనమామ మాకు బాగా తెలుసు, చాలా మంచి మనిషి అంటే ఆ సంతృప్తి వేరు. Was he a faultless man, no he was not, but then again, none of us are.
పెళ్ళయ్యాక ఒక తోడు వాల్యూ ఏంటో తెలుస్తుంది మనిషికి. ఆయన వెళ్ళాక తల్లి తండ్రులు బాధపడ్డారు, తోబుట్టువులు బాధపడ్డారు, పిల్లలు బాధ పడ్డారు. అందరికంటే తీర్చలేని బాధ మా అత్త ది. ఆయన ఏమి చేయకుండా మనిషి ఉన్నా ఆవిడకి చాలు. మా అందరి కంటే ఆవిడ బాధని ఎవరు తీర్చలగలరు, పిల్లలు ఉన్న, మనవళ్లు, మనవరాళ్లు ఉన్నా, ఆ లోటు లోటే ఆవిడకి. ఆయన పోయింది నా పుట్టిన రోజుకి ఒక రోజు ముందు. సో, ఫ్యామిలీ గ్రూప్ లో ఆయన్ని గుర్తు చేసుకుని, నెక్స్ట్ డే పుట్టిన రోజు విషెస్ అంటే బాధ, సంతోషం పక్క పక్కనే ఉంటాయి అని మరో గుర్తు.
మా అత్త తరవాత బాగా నష్టపోయింది ఆయన మనవళ్లు, మనవరాళ్లు. ఆయన ఉండి ఉంటే ఎంత మురుసుకుని ఇంత నెత్తిన పెట్టుకునేవాళ్లో కదా అనిపిస్తుంది. అసలు కంటే వడ్డీ ముద్దు అన్నట్టు వాళ్లే ఆయనకి ఎక్కువ, ఎందుకంటే అదే ప్రేమ మేము అనుభవించాం మేనల్లుళ్లు, మేనకోడలుగా. ఆయన చూసింది ఒక్క మనవరాల్ని మాత్రమే అది కూడా చాలా తక్కువ సమయం, అంత వరకే మనకి ప్రాప్తం అనుకోవాలి. ఫ్యామిలీ మొత్తం వేరే విధంగా బానే ఉన్నాం అందరం, కానీ తాత తరువాత ఇంటికి పెద్ద ఎక్కువ రోజులు లేరు అనేది లోటు ఇప్పటికీ. ఇప్పటికీ చెల్లెళ్ళు గుర్తు చేసుకుంటారు వాళ్ళ పెద్ద కొడుక్కి పెద్ద మేనమామ సోకులు వచ్చాయి అని. అదే నా చిన్న మేనల్లుడి కి మా అబ్బాయికి వచ్చాయి. బయటికి వెళ్తే వాచ్, కళ్ళద్దాలు స్టైల్ తగ్గకూడదు. అలా ఎప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంటాం ఇప్పటికీ :).

Great Bava . Plz continue
ReplyDeleteYour words literally took me to those golden days….scene by scene I remember….just recollecting …enadi people cleaning dishes in big sink part……getting water from baavi…my bond was more special….🥰
ReplyDelete❤️
ReplyDeleteVery good portrait. He is my Babai
ReplyDeleteచాలా బాగా రాశాడు. Good portrait. ఆయనతో ఎక్కువ గా కోళ్ల ఫారం.లో పరిచయం.కోళ్ల ఫారం లో గుడ్లు తీస్తుంటే ఉత్సాహ పరిచేవారు.ఫారం కి కోడిపిల్లలు వాన్ రావటం, అన్ని పిల్లలను ఆశ్చర్యం గా చూడటం నాకు ఇంకా గుర్తు
ReplyDelete