Sunday, August 17, 2025

అమ్మమ్మ

 పెద్ద మావయ్య గురించి వ్రాసినది చదివి పాత జ్ఞాపకాలు చాలానే నెమరు వేసుకున్నారు ఫ్యామిలీ లో. మళ్ళీ ఇంకొకటి వ్రాయడానికి ఇంత సమయం పట్టింది. అమ్మమ్మ గురించే వ్రాయాలి అని అనుకున్నాను, కానీ ఇవాళ వ్రాయడానికి కారణం వేరే ఉంది. మా అమ్మమ్మ పేరు సత్య జ్ఞాన ప్రసూనాంబ. కానీ కుటుంబంలో, ఊర్లో, పని వాళ్ళకి ఆవిడ గ్యాణమ్మ, గ్యాణమ్మ గారు. ఆఖరికి మా బావలు, వదినలు అలానే పిలిచేవారు. చిన్న పిల్లలం మేము మాత్రం అమ్మమ్మ, నాయనమ్మ అని పిలిచేవాళ్ళం. ఆవిడ ఒక ఊరి మునసబు గారి అమ్మాయి, వాళ్ళ అత్తగారిని (అమ్మ వాళ్ళ నాయనమ్మని) వాళ్ళ అత్తగారు సరిగా చూసేది కాదు అంట. ఎందుకు అంటే పెద్ద కుటుంబం నుంచి రాలేదు అని. అందుకు పట్టు బట్టి ఆవిడ తనకి ముగ్గురు కోడళ్ళు మునసబు గారి అమ్మాయిలని తెచ్చుకుంది. అమ్మమ్మ ఆఖరి కోడలు, ముగ్గురిలో, అమ్మమ్మకి ఒక ఆడపడుచు ఉండేది, పాలెం లోనే. 


అమ్మ వాళ్ళ నాయనమ్మ ఎక్కువ కూతురు దగ్గరే ఉండి, అవసరం అయినప్పుడు వచ్చి కొడుకు దగ్గర ఉండి మళ్ళీ మనవరాళ్ళకి హెల్ప్ చేసి వెళ్ళి పోయేది. ఆవిడ గట్టిగా జడలు వేసేది అని గుర్తు చేసుకుంటుంది పెద్దమ్మ. అమ్మమ్మ కి అమ్మ, ఆఖరి మావయ్య చిన్నప్పుడు జబ్బు చేసి పొట్టలో చాలా రోజులు మంచంలో ఉందట. అప్పట్లో వాళ్ళ అక్క అంటే మా పెద్దమ్మమ్మ వచ్చి ఉండి నెలలు తరబడి పిల్లల్ని పెంచేది అంట. అందుకే అప్పట్లో పెద్దమ్మ ఎక్కువ సెలవుల్లో కజిన్స్ దగ్గర బొబ్బర్ల్లంక , నర్సింపురం లో పెరిగింది. అందుకే వాళ్ళంటే ఇప్పటికీ అంత అభిమానం, ప్రేమ కజిన్స్అయినా, అక్కలే పెంచారు అని. ఇవాళ ఇల్లు పిల్లలు వదిలేసి చెల్లెలి కోసం అంత చేసే అక్క ఉండటం చాలా అరుదు, పరిస్థితి కూడా అనుకూలించదు. అందుకే మా పెద్దమ్మమ్మ కుటుంబం అంతా మాకు చాలా స్పెషల్, పెద్దమ్మలు, అన్నయ్యలు, అక్కలు. అందులో నాకు అక్క (అమ్మ కంటే పెద్దది) నా సంబంధం సెట్ చేసింది ఆవిడ, ఆ పెదనాన్న (నేను పెద్దమ్మ, పెదనాన్న అంటాను వరసకు అక్క బావ అయినా). మా పెద్ద తాతగారు చేల గట్ల వెంబడి పెద్దమ్మని మెడ మీద ఎక్కించుకుని వచ్చే వారట 10 కిలోమీటర్లు పైనే నడిచి. మొత్తానికి ఆపరేషన్ అయ్యాక అమ్మమ్మ ఆరోగ్యం కుదుటపడింది. 

అమ్మమ్మ పెద్ద కోడలుగా అన్న కూతుర్ని అంటే మళ్ళీ మునసబు గారి అమ్మాయినే తెచ్చుకుంది. అదే అన్న గారి ఇంకో అమ్మాయి అమ్మమ్మ కి బావ గారి కోడలైంది (బానే స్కెచ్ వేసింది ఆ రోజుల్లో, అమితంగా ప్రేమించిన ఇద్దరు పెద్ద కొడుకులకి మేనకోడళ్ళని కట్టబెట్టింది ;-)). ఊర్లోనే తెలిసిన గారి అమ్మాయి రెండో కోడలు, మూడో కోడలు నైజాం, నాలుగు మళ్ళీ కృష్ణా జిల్లా నే. అందరిలోకి కలిసి ఉంది పెద్ద కోడలి తోనే. మా ఊహ తెలిసే సరికి తాత ఆస్తి పంచేశారు పిల్లలకి. పెద్ద మావయ్య వాటా ఇంట్లో వాళ్ళు ఉండేవాళ్ళు పాలెంలో, ప్రేమ ఎక్కువ కాబట్టి తను ఉన్న ఇల్లు ఇచ్చారేమో మరి. నేను పుట్టక ముందే పొలం దగ్గర పెంకుటిల్లు వేసుకుని వెంకటాపురం వెళ్ళిపోయారు. వేసవి సెలవుల్లో పాలెం, వెంకటాపురం లో ఎక్కువ సమయం గడిపేవాళ్ళం,వెంకటాపురంలో కరెంటు ఉండేది కాదు అన్ని లాంతరు వెలుగే 1991 దాకా, సో అక్కడ ఉన్నాం అంటే 7 కల్ల తినేసి బెడ్ ఎక్కాలి, పాములు వస్తాయని మదర్ ఇండియా భయం:). 

పాలెం ఇంట్లో గుర్తులు ఉన్నట్టే వెంకటాపురం గుర్తులు చాలా ఉన్నాయి, టేకు బీరువా, అమ్మమ్మ పచ్చడి జాడీలు, అమ్మమ్మ కూర్చుని వంట చేసే పీట, ఆవిడ రుబ్బు రోలు. వాకిట్లో బచ్చలి కూర ఉండేది, అది ఎప్పటికప్పుడు కోసి పప్పు పెట్టేది. అది తింటే ఇంకా స్వర్గమే. బీరకాయ పాలు పోసి, ఆవిడ చేసినట్టు అల్లపచ్చడి ఎవరూ చెయ్యలేరు, ఆవిడ వండిన బూరెలు కూడా. ఫిష్ అవి వండినా కూడా ఆవిడ చేసిన వెజ్ ఎప్పటికీ గుర్తు ఉండి పోతుంది. ఏదో జస్ట్ వంటలు గురించి చెప్తూ ఉన్నాను ఆవిడ స్టిక్ టు కిచెన్ బ్యాచ్ అసలు కాదండోయ్. మునసబు గారి అమ్మాయి, మంచి ఫ్యామిలీ కి వచ్చింది, ఏది తప్పు, ఏది కాదు అని అన్ని మాకు గుర్తు చేసేది. ఏదన్నా అల్లరి చేస్తే తమాషా గా వేలు చూపించి నువ్వు చేసేది ఏమన్నా బాగుందా అన్నట్టు ప్రశ్నించేది. మా తాత డామినేట్ చేసినా బయట, ఇంట్లో ఎక్స్ట్రా మాట్లాడితే డోస్ ఇచ్చేది స్మూత్ గా. 

ఎంత చెప్పినా ఆవిడకి పెద్ద కొడుకు, కోడలు, వాళ్ళ పిల్లలు అంటే అమితమైన ప్రేమ. వాళ్ళు కూడా అలానే ఉండే వాళ్ళు, అమ్మ అని పిలిచేవాళ్ళు. నేను చెప్పినట్టు మా బావ ఎంత వెధవ పని చేసిన కొడుకు ముందు, మనవరాళ్ల ముందు సమర్ధించేది:). మా డాక్టర్ మావయ్య పిల్లలు దూరం వల్ల ఎప్పుడూ వచ్చే వాళ్ళు కాదు, మేమేమో ప్రతి వేసవి కి వెళ్ళే వాళ్ళం. సో వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తే చిన్నప్పుడు కొంచెం కోపం వచ్చినా తర్వాత వాళ్ళు ఎప్పుడో కానీ రారు కదా అందుకేనేమో అనిపించేది. ఎంత పెత్తనం చేసినా మా పెద్ద అత్త ఏమి అనకుండా సైలెంట్ గా ఉండేది. మెల్లగా వాళ్ళే సర్దుకునే వాళ్ళు. మునసబు గారి అమ్మాయి కదా, అమ్మమ్మ పాలెం లో ఉన్నప్పుడు పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరు వచ్చినా టిఫిన్, కాఫీ ఇక్కడే. ఆవిడ వేరే ఫేవరెట్ అంటే చెల్లెలి పిల్లలు, ఇద్దరు ఊర్లోనే ఉండేవాళ్ళు. ఎప్పుడూ ఏ పని అడిగినా కాదనకుండా పెద్దమ్మ కి చేసి పెట్టే వాళ్ళు. 

పెద్ద మావయ్య పోవడం చాలా పెద్ద బాధ కుటుంబం మొత్తానికి. కానీ కళ్ళ ఎదురుగా బిడ్డ పోతే బాధ ఒక తల్లికి ఎలా ఉంటుందో నేను చిన్నతనము లో చూసాను అమ్మమ్మ రూపంలో. ఇప్పుడు అనిపిస్తుంది, ఆవిడ ఇంకొక 10 సంవత్సరాలు ఉన్నా, నిజంగా ఆ బాధ నుంచి రికవర్ అవ్వలేదేమో. ఏ తల్లి అవ్వదేమో బతికి ఉన్నంత కాలం, వాళ్ళని తిరిగి కలిసే దాకా. బావ చెప్పాడు నువ్వు ప్రతి వారం వాళ్లకి లెటర్ రాయాలి అని, ఒక సంవత్సరం పైనే రాసి ఉంటాను, మాటలు కూడా ఒక రకం అయిన ఓదార్పు, ఫోన్ పెట్టించుకుని మాట్లాడే డబ్బులు లేవు అప్పట్లో 90s lo. ఆవిడ తట్టుకుని ఉన్నంతలో తను తిని పని వాళ్ళకి పక్కన వాళ్ళకి పెట్టేది ఆఖరి దాకా. ఆవిడకి ఆఖరి 2 ఏళ్ళు alzheimer's లాగ వచ్చింది. నేను, అమ్మ, పెద్దమ్మ, వదిన, బావ వీలు అయినంత వెళ్ళి ఊర్లో ఉండే వాళ్ళం. ఇంటికి ఎవరు వచ్చినా ఏదో ఒకటి పెట్టి, కమ్మగా కాఫీ ఇచ్చి పంపేది. ఒక సారి అమ్మ, నేను ఉన్నాం కొన్ని రోజులు, అప్పటికి alzheimer's వచ్చింది. ఏదో మాటల్లో డైరెక్ట్ గా అనేసింది "ఏంటి మరీ వెర్రి దాన్ని అనుకోకండి, నేను మునసబు గారి అమ్మాయిని, మునసబు గారి చెల్లెల్ని" అని. 


ఇప్పటికీ తెలిసిన వాళ్ళు, మేనల్లుళ్లు, గుర్తు చేసుకుంటూ ఉంటారు గ్యాణమ్మ మామ్మ బాగా చూసేది అని. ఆఖర్లో ఒక నెల పైనే మంచం లో ఉంది. అప్పట్లో నేను ఖాళీగా ఉన్నాను, అమ్మ కొన్ని రోజులుండి వెళ్ళిపోయింది. పెద్దమ్మ తో నేను కూడా ఉన్నాను, నెల పైనే, మావయ్యలు, అత్తలు అందరం ఉన్నాం. పనులు అన్నీ నేను, ఇంకో ఇద్దరు మావయ్యలు చూసుకున్నాం. దినం రోజు భోజనం పెట్టీ, సాయంత్రం ఆడ పిల్లలు NV పెట్టారు, పెద్దమ్మ చికెన్ ఫ్రై తనే వండింది, దగ్గరి వాళ్ళు అంతా కలిపి ఒక యాభై మంది అయ్యారు రాత్రికి. ఆవిడ్ని గుర్తు చేసుకుని కబుర్లు చెప్పారు అందరూ, అదొక రకం ఓదార్పు. వెంకటాపురం ఇల్లు ఇప్పటికీ కలలోకి వస్తూంటుంది నాకు. అమ్మ కూడా అప్పుడు అప్పుడు అమ్మమ్మ, తాత, మావయ్యలు కలలో వచ్చారు అని చెప్తుంది. బహుశా అది వాళ్ళని గుర్తు చేసుకున్న కొన్ని రోజులకు అయ్యి ఉండవచ్చు. 


ఆ కాలువ గట్టు, ఇంటి ముందు చేను, చావిడి, వెంకటాపురం కథ ఇంకో సారి చెప్తాను. అమ్మమ్మ సూటిగా మాట్లాడినా, ప్రేమగా ఉన్నంతలో కొంచెం పెట్టీ, కబుర్లు చెప్పి, ఆ కాసేపు అయినా మనస్సులో ఉన్న బాధలు మర్చి పోయేట్టు చేసేదేమో చాలా మందికి అని నా నమ్మకం. చెట్టు అంత కొడుకు పోయిన ఇంత నిబ్బరంగా ఉంది, మన బాధలు ఎంత లే అని ఒక్కళ్ళు అనుకున్నా చాలు కదా :). మనలో చాలా మందిని తల్లి తండ్రులు మాత్రమే పెంచలేదు, ప్రభావితం చేయలేదు. అమ్మమ్మలు, నాయనమ్మలు, పెద్దమ్మలు, అత్తలు ఎంతో మంది కలిసి పెంచితే మనం ఇలా ఉన్నాం. It takes a village to raise a child. మీరు మీ పెద్ద వాళ్ళని తలచుకుని ఆ జ్ఞాపకాలు నెమరు వేసుకుంటారు అని ఆశిస్తాను. అదే విధంగా ఇంకా అమ్మమ్మలు, నాయనమ్మ లు ఉండి వాళ్ళతో మాట్లాడగలగడం ఒక అదృష్టం. దయ చేసి వాళ్ళతో ఒక రెండు నిముషాలు రోజులో మాట్లాడండి.


 నేను అప్పుడు రియలైజ్ అవ్వకపోయినా, ఆవిడ ఆఖరి 10 ఇయర్స్ నేను మిస్ కాకుండా, ఎంత వీలైతే అంత సమయం గడిపాను, నాకు ఆ సమయం మళ్ళీ రావాలన్నా రాదు, ఇలా జ్ఞాపకాలు, కలలో చూడటం తప్ప. మా అమ్మాయి పుట్టాక కబుర్లు బాగా చెపుతోంది అంటే, మా పెద్దమ్మ (అమ్మ కజిన్) బుల్లి గ్యానమ్మ ఎలా ఉందే అని అలా పేరు పెట్టింది వాళ్ళ పిన్ని నీ గుర్తు చేసుకుని. మా అమ్మమ్మ గురించి ఏమన్నా గుర్తు వస్తే కింద కామెంట్ చేయండి :), చూసి సంతోషం గా ఉంటుంది.